రాజంపేట మార్చి 07
(నవ్యంధ్ర న్యూస్ )
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, శనివారం రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ నాగార్జున గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థినులకు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అర్బన్ సీఐ నాగార్జున విద్యార్థినులకు పోలీస్ స్టేషన్ పనితీరుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఒక ఫిర్యాదు అందినప్పటి నుండి కేసు నమోదు వరకు నిర్వహించే ప్రక్రియను విద్యార్థినులకు వివరించారు. ఆపద సమయంలో మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, చట్టపరమైన వెసులుబాట్లు ఏమిటి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
ఆపదలో ఉన్నప్పుడు వెంటనే డయల్ 100,112 సేవలను ఎలా
వినియోగించుకోవాలో డెమో ద్వారా వివరించారు.
సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తుతెలియని వ్యక్తులతో ప్రవర్తించవలసిన తీరు పై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,విద్యార్థినులు భయం వీడి పోలీసులను స్నేహితులాగా భావించి సమస్యలను
పంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు,తదితరులు పాల్గొన్నారు.

