తిరుపతి జిల్లా ఫిబ్రవరి 24
(నవ్యంధ్ర న్యూస్ )
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన భక్తుల్లో , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, స్వయం ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తిరుమల పవిత్రతను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత , పాలకమండలి సభ్యుల నియామకాలపై తలెత్తిన వివాదాలు వంటివి రాకూడదని చంద్రబాబు అనుకుంటున్నారు. స్వర్ణదేవాలయం గురించి ఆలోచిస్తున్నారు.
సిక్కుల పార్లమెంట్ ద్వారా స్వర్ణదేవాలయం నిర్వహణ
1925 నాటి సిక్కు గురుద్వారా చట్టం ప్రకారం స్వర్ణ దేవాలయం స్వతంత్రంగా పనిచేస్తుంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని నిర్వహించే SGPC సభ్యులు కేవలం రాజకీయ నామినేషన్ల ద్వారా రారు. సిక్కు సమాజం ఓటింగ్ ద్వారా వారిని ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ సభ్యులు కేవలం మతపరమైన అంశాలు, భక్తుల సౌకర్యాలు, సామాజిక సేవా కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తారు. తిరుమలలో కూడా ఇలాంటి ఎన్నికల ప్రక్రియ , నిష్ణాతులైన ఆధ్యాత్మిక వేత్తల ఎంపిక ద్వారా కమిటీని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అనే అంశంపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోంది.
రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట
ప్రస్తుత చట్టం ప్రకారం టీటీడీ చైర్మన్ , సభ్యులను నేరుగా ప్రభుత్వంనియమిస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకులకు ఇక్కడ ప్రాధాన్యత లభిస్తోందని, తద్వారా నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గి కేవలం ఆధ్యాత్మిక నిబద్ధత ఉన్నవారికే బోర్డులో చోటు దక్కుతుంది. ఇది సంస్థను మరింత జవాబుదారీగా మార్చడమే కాకుండా, భక్తుల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తుంది. స్వర్ణ దేవాలయ నిధులను ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడటం సాధ్యపడదు. అవి కేవలం విద్య, వైద్యం , మత ప్రచారానికే పరిమితం. తిరుమలలో కూడా భక్తులు సమర్పించే కానుకలు, ఆదాయం కేవలం ఆలయ అభివృద్ధికి, హిందూ ధర్మ ప్రచారానికే వాడేలా కఠినమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంత తేలిక కాదు!
సిక్కు మతం, హిందూ మతం మధ్య ఉన్న వ్యవస్థాగత వ్యత్యాసాల వల్ల ఈ చట్టం అమలు చేయడం ఒక పెద్ద సవాలుగా మారవచ్చు. స్వర్ణ దేవాలయం కేవలం ఒక మతానికి చెందిన ఎన్నికైన కమిటీ ద్వారా నడుస్తుంది, కానీ టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో ఉంటుంది. అన్యమతస్తుల డిక్లరేషన్ వంటి సున్నితమైన అంశాలకు కూడా చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన హిందూ ఆలయాలకు కూడా తిరుమల ఒక ఆదర్శంగా నిలుస్తుంది.

