పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేసిన మాజీ మంత్రి బ్రహ్మయ్య కుమారుడు ప్రదీప్ దంపతులు
రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
మండలపరిధిలోని భువనగిరిపల్లిలో వెలసియున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన భువనగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భువనగిరి లక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం లక్ష్మీ సమేత నరసింహస్వామి కళ్యాణం వేద పండితులు మంత్రోచ్ఛరణాలు మంగళ వాయిద్యాలు అన్నమయ్య సంకీర్తనలు అశేష భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు
ఈ కళ్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపులేటి ప్రదీప్ కుమార్ దంపతులు,జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణలు ముత్యాల తలంబ్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేదికను మామిడి తోరణాలు అరటి పిలకలతో అందంగా తీర్చిదిద్దారు. వేదపండితులు లక్ష్మీ సమేత నరసింహ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో కళ్యాణ వేదికపై కొలువు తీర్చి సంప్రదాయబద్ధంగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ కళ్యాణ క్రతువును నిర్వహించారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాల కోసం భక్తులు తోటి భక్తులతో పోటీ పడడంతో
భక్తుల నడుమ కొంచెం తోపులాట చోటు చేసుకుంది కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి మూడవ అదనపు జడ్జి ప్రవీణ్ కుమార్, కడప సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష , తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు, పట్టణ సిఐ రాజా దంపతులతో పాటు జిల్లా నలుమూలల నుంచి పలువురు నేతలు అధికారులు, అనధికారులు విశ్రాంత అధికారులు భువనగిరి గ్రామ ప్రజలు పట్టణ, గ్రామీణ పరిసర ప్రాంత భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు. భువనగిరి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలతో భువనగిరి పల్లి గ్రామంలో ప్రత్యేక సందడి నెలకొంది. కళ్యాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ రాజా ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణానికి విచ్చేసిన పలువురు ప్రముఖులను, ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను సత్కరించి ప్రసాదాలను అందజేశారు.

