Hit – The Third Case: హిట్ -3 మూవీ రివ్యూ

Spread the love

నేచురల్ స్టార్ నాని (Nani) టైమ్ ఇప్పుడు బాగుంది. ప్రశాంతి తిపిర్నేని (Prashanthi Tipirneni) తో కలిసి నాని ప్రొడ్యూస్ చేసిన ‘కోర్ట్’ (Court) మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇంతవరకూ ‘హిట్’ (Hit) ఫ్రాంచైజ్ లో విశ్వక్ సేన్ (Vishwaksen), అడవి శేష్ (Adivi Sesh) హీరోలుగా నటించగా, ఇప్పుడు థర్డ్ కేసును నానీ నే టేకప్ చేశాడు. డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh kolanu) ‘హిట్ -3’లో నాని ని అర్జున్ సర్కార్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు. ‘హిట్ -3’ మూవీకి పిల్లలను, వయసు మీద పడిన వారిని దూరంగా ఉండమని నాని రిలీజ్ కు ముందే ఎందుకు హెచ్చరించాడో తెలుసుకుందాం.

రొటీన్ కు భిన్నమైన కేసులను టేకప్ చేసి, సైలెంట్ గా వాటిని సాల్వ్ చేసే సంస్థ హిట్. తొలి రెండు సినిమాల్లో డిఫరెంట్ కేసులను అందులోని హీరోలు టేకప్ చేస్తారు. వాటితో పోల్చితే… ఇది చాలా చాలా డిఫికల్ట్ కేసు. పైగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలకు సంబంధించింది. ఇందులోని సైకో గ్యాంగ్ చేసే అరాచకాలు చూస్తే ఎవరికైనా రక్తం మరిగి పోవాల్సిందే. అసలు ఇలాంటి వారు మన మధ్య సాధారణ వ్యక్తుల్లా ఎలా తిరుగుతుంటారా? అనే సందేహమూ కలుగుతుంది. కానీ కాస్తంత లోతుగా విషయాలను అధ్యయనం చేస్తే… ఇలాంటి వాళ్ళు ప్రతిచోటా ఉన్నారనేది అర్థమౌతుంది.

ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో వయొలెన్స్ హద్దులు మీరి, అవసరానికి మించి ఉందన్నది స్పష్టం. అలా వచ్చిన వాటిల్లో ప్రధానంగా శైలేష్ కొలను మీద ‘యానిమల్ (Animal), కిల్ (Kill), మార్కో (Marco) ‘ వంటి చిత్రాల ప్రభావం ఉందేమో అనే సందేహం ‘హిట్ -3’ చూశాక కలగక మానదు. అపరిమితమైన హింస ఉన్న ఈ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి… తమ చిత్రాన్నీ ప్రేక్షకులు హిట్ చేస్తారని ‘హిట్ -3’ దర్శక నిర్మాతలు భావించారేమో! కథ పరంగా వాటికీ దీనికీ ఎంతో తేడా ఉంది. అయితే… సైకో గ్యాంగ్ ను ఎదుర్కొనే క్రమంలో హీరో కూడా సైకోగా మారాల్సిన అవసరం లేదనే విషయం మేకర్స్ గుర్తిస్తే బాగుండేది.

అర్జున్ సర్కార్ పాత్రలోని డెప్త్ ను అర్థం చేసుకుని నాని చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. ఈ దేశం కోసం, ఇక్కడి పౌరులను రక్షించడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే పోలీస్ ఆఫీసర్ గా బాగా చేశాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ క్యారెక్టర్ టెంపో తగ్గకుండా చూసుకున్నాడు. అతని అసిస్టెంట్ గా కోమలి ప్రసాద్ చక్కగా చేసింది.

నాని మొదటి నుండి చెబుతున్నటు ముందు వచ్చిన ‘హిట్’ చిత్రాలు రెండూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాగా, ఇది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. సో… ఆ జానర్ ఇష్టపడే వారు ఎంజాయ్ చేస్తారు. నాని మొదటి నుండి ‘ఇది మోస్ట్ వయొలెంట్ మూవీ’ అని ఎంత గట్టిగా చెప్పినా… అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే ఉన్నాయి. పైగా ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యింది. సో… ఓపెనింగ్స్ కు, వీకెండ్ కలెక్షన్స్ కు కొదవ ఉండదు. ఓవర్ ఆల్ రన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

ట్యాగ్ లైన్: అర్జున్ సర్కార్ ఊచకోత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *