తప్పుడు కథనాలతో రైతులను ఆందోళనకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
అధికారులు ట్రేడర్స్ రైతు సంఘాలు సమన్వయంతో బొప్పాయి ధర నిర్ణయించబడుతుంది.
టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో 08 రూపాయలు సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలో 07.50 రూపాయలుగా నిర్ణయించబడింది
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
జిల్లాలో పంట పండించే ప్రతి ఎకరాకు అవసరానికంటే మించి యూరియా అందుబాటులో ఉందని, తప్పుడు కథనాలతో రైతులను ఆందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అధికారులు ట్రేడర్స్,రైతు సంఘాల సమన్వయంతో బొప్పాయి ధర నిర్ణయించబడుతుందని, టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో 8 రూపాయలు సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలో ఏడున్నర రూపాయలుగా శనివారం నిర్ణయించబడిందని, బొప్పాయి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు
రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని యూరియా నిలువ, బొప్పాయికి మద్దతు ధర,తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి,జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….. జిల్లాలో పంట పండించే ప్రతి ఎకరాకు అవసరానికంటే మించిన యూరియా అందుబాటులో ఉందని, జిల్లాలో యూరియా కొరత రావడానికి అవకాశమే లేదన్నారు. పంట పండించే ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున ఇవ్వగలిగే యూరియా నిల్వలు జిల్లాలో ఉన్నాయన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో 44% లోటు వర్షపాతం నమోదైనందున 57 వేల హెక్టార్లకు గాను కేవలం 10600 హెక్టార్లలో సాగు చేస్తున్నారన్నారు.అంటే 18 శాతం మాత్రమే సాగవుతోందన్నారు. సెప్టెంబర్ 6 నాటికి ప్రైవేటు డీలర్ల వద్ద 518 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాలలో 460 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని 21742 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 10600 హెక్టార్లు అనగా సుమారు 25 వేల ఎకరాలకు గాను ప్రస్తుతం అందుబాటులో ఉన్న 978 మెట్రిక్ టన్నుల యూరియా సరిపోతుందన్నారు. శుక్రవారం వరకు రైతులు కొన్న మొత్తం యూరియా సుమారు 5 వేల మెట్రిక్ టన్నులకు అదనంగా సెప్టెంబర్ 6 నాటికి 978 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.రైతు పండించే ప్రతి ఎకరాకు సరిపడా యూరియా కంటే ఎక్కువగానే మన జిల్లాలో అందుబాటులో ఉందన్నారు. వచ్చే వారంలో మరో 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి రానుందన్నారు కావున రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పంట వేసిన వారికి మాత్రమే యూరియా అమ్మేలా చర్యలు తీసుకుంటున్నామన్నారుకొంతమంది కృత్రిమంగా యూరియా డిమాండ్ ఎక్కువ చేయడం వల్ల తప్పుడు కథనాల వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని అటువంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. .
ఎమ్మెస్ స్వామినాథన్ లాంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినట్లుగా కెమికల్ ఫర్టిలైజర్ లను అవసరానికి మించి వినియోగించడం వల్ల భూమి సారం తగ్గుతుందని పంట నాణ్యత తగ్గుతుందన్నారు. కాబట్టి రైతులందరూ అవసరానికంటే మించి యూరియా లాంటి ఫర్టిలైజర్ లను వాడవద్దన్నారు వచ్చే వారంలో మండల, గ్రామస్థాయిలో యూరియా వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బొప్పాయి పంటపై మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో
సుమారు 4000 మంది రైతులు 11 వేల ఎకరాలలో బొప్పాయి పంట పండిస్తారని రాజంపేట రైల్వే కోడూరు లలో సాగు ఎక్కువగా ఉంటుందని మిగిలిన ప్రాంతాలలో కొద్దిగా తక్కువగా ఉంటుందన్నారు. జూన్, జూలై మాసాలలో మొదటి కోత అనంతరం కిలోకు 16 రూపాయల ధరతో రైతుల దగ్గర కొనేవారని, అనంతరం ఉత్తర భారత దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల బొప్పాయి ధర తగ్గిందని దీన్ని కట్టడి చేయడానికి గతంలో ట్రేడర్లు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్,చైర్మన్ రూపనంద రెడ్డి,రైతు సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు తొమ్మిది రూపాయలతో ధర నిర్ణయించామన్నారు. చిట్వేల్ లో ఆలస్యంగా బొప్పాయి సాగు చేస్తున్నారన్నారు. అధికారులు రైతు సంఘాలు ట్రేడర్లు అందరి సమన్వయంతో ఢిల్లీలో ఏ ధరైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఏ రోజుకారోజు బొప్పాయి ధర నిర్ణయించి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. నేడు రైతు సంఘాలు ట్రేడర్లతో చర్చలు అనంతరం టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో 8 రూపాయలు సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలో ఏడున్నర రూపాయలుగా నిర్ణయించబడిందన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు అమ్మితే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని బొప్పాయి రైతులు కంట్రోల్ రూమ్ ను వినియోగించు
కోవచ్చని బొప్పాయి రైతులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో పంట తక్కువగా సాగు చేస్తున్నందున యూరియా అవసరం తక్కువగా ఉంటుందని ప్రైవేటు డీలర్ల వద్ద,రైతు సేవ కేంద్రాలలో రైతులందరికీ అవసరమయ్యే యూరియా కంటే ఎక్కువగా అందుబాటులో ఉందన్నారు.కొంతమంది రైతులను రెచ్చగొట్టడం కృత్రిమంగా యూరియా కొరత సృష్టించడం వంటి పనులు చేస్తున్నారని
ఈ పనులు చట్టరీత్యా నేరమని అటువంటి పనులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది సోషల్ మీడియాలలో తప్పుడు కథనాలు రాస్తున్నారని దానివల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని, సోషల్ మీడియాలలో తప్పుడు కథనాలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

