12 వ పిఆర్సీ అమలులో జాప్యాన్ని ఒప్పుకోం.

Spread the love

ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి హెచ్చరిక.

కడప జిల్లా ఏప్రిల్ 12

(నవ్యంధ్ర న్యూస్ )

ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని రాజంపేట రీజియన్ సమావేశంలో రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పట్టణంలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కన్వీనర్ పెంచలయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రీజియన్ సమావేశంలో రాజంపేట,నందలూరు, సుండుపల్లి,వీరబల్లి మండలాల ఎస్టియు నాయకులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష హోదాలో కూటమి పెద్దలు ఉద్యోగ,ఉపాధ్యాయులకు అనేక హామీలిచ్చారన్నారు. తాము అధికారంలోకి వస్తే 12వ పిఆర్సీని అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ మెరుగైన వేతనాలను అమలు చేస్తామని,ఆర్థిక బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని, డిఏ లను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా హామీల అమలులో చిత్తశుద్ధి కనపరచడం లేదన్నారు. పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు అయిందని, అయినప్పటికీ పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్య చేస్తున్నదని విమర్శించారు. పిఆర్సీ అమలుకు నోచుకోకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అధికారం చేపట్టిన ఆరు మాసాలలోగా చెల్లిస్తామన్న ఆర్థిక బకాయిలు, రెండేళ్లయినా పూర్తి చెల్లింపులకు నోచుకోలేదన్నారు.15000 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించి, ఉద్యోగుల బకాయిలన్నింటిని చెల్లించినట్లు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటన చేయడం ఉద్యోగులను వంచించడమేరన్నారు. ఇంకా 27 వేల కోట్ల పైబడిన బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందని, ఉపాధ్యాయులకు మాత్రం సరెండర్ లీవ్ లు చెల్లించడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం యస్.టి.యు మూడు దశల ఉద్యమ శంఖారావం ద్వారా ఉద్యమాలు చేపట్టిందని భవిష్యత్తులో ఫ్యాప్టో,ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడమని సమస్యల పట్ల ప్రభుత్వం
సానుకూలంగా
స్పందించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
యస్.టి.యు రాష్ట్ర నాయకులు సుబ్రమణ్యం రాజు,ఇలియాస్ బాషా మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. గత వైసిపి ప్రభుత్వం రివర్స్ పిఆర్సీని అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందన్నారు. కూటమి ప్రభుత్వం కొద్ది మేరకు ఆర్థిక బకాయిల్ని చెల్లించినప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు చేపట్టకపోవడం తగదన్నారు. ఆర్థిక బకాయిలపై రోడ్ మ్యాప్ ప్రకటించి నిర్ణీత గడువులోగా బకాయిలను చెల్లించాలని కోరారు. కూటమి ప్రభుత్వం సైతం గత ప్రభుత్వ విధానాలనే అమలు చేయడం తగదన్నారు. సమస్యల పరిష్కారం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే పోరాటమే శరణ్యమన్నారు.
యస్.టి.యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వర్ రెడ్డి పాలకొండయ్య మాట్లాడుతూ పాలకవర్గాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారపక్షంలోకి రాగానే మరోరకంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉద్యోగ ,ఉపాధ్యాయుల సమస్యలపై మొసలి కన్నీరు కార్చిన కూటమి పెద్దలు గద్దెనెక్కగానే ఉద్యోగుల సమస్యలను విస్మరించడం ఏంటని ప్రశ్నించారు. సకాలంలో డిఏలు చెల్లించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించిన కూటమి పెద్దలు నేడు మూడు డి.ఏ లను పెండింగ్లో ఉంచడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న కూటమి నేతలు ఆ వైపుగా ఒక్క అడుగు కూడా వేయకపోవడం దుర్మార్గమన్నారు. ఎస్ టి యు మరియు ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షల ఫలితంగానే మెమో నెంబర్ 57 ద్వారా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ సంబంధిత ఫైలుపై ఫైనాన్స్ సెక్రటరీ గారు సంతకం చేయడం హర్షినీయమని వారు తెలిపారు .కరోనా మహమ్మరితో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న వైఖరిని తేటతెల్లం చేస్తున్నదన్నారు. మూడేళ్లుగా సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపులు లేవన్నారు. ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు చెల్లని రూకలా ఉన్నాయన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదన్నారు. ఉద్యోగులు ఆగ్రహిస్తే ఏమి జరిగిందో పాలకులకు తెలియనిది కాదన్నారు. తక్షణమే స్పందించి సంఘాల నాయకులను చర్చలకు పిలిపించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో
అల్లం అశోక్ కుమార్, బాలగంగి రెడ్డి,రమణారెడ్డి, అన్నపూర్ణమ్మ,రవీంద్రారెడ్డి, నరసింహులు,సుబ్రహ్మణ్యం రాజు,ఓబులేసు,సత్యం సాయన్న,రవిశంకర్ రెడ్డి, ఆరిఫుల్లా,షఫీ,వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *