న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10
(నవ్యంధ్ర న్యూస్ )
రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ 2026–27 పై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ కనిపిస్తోందని పేర్కొన్నారు. మొత్తం వ్యయం సుమారు ₹53.5 లక్షల కోట్లు, జీడీపీలో 4.3 శాతం ఆర్థిక లోటు లక్ష్యంతో బడ్జెట్ సమతుల్యంగా ఉందన్నారు. అయితే, దేశ ఆర్థిక వృద్ధి ప్రధానంగా వినియోగంపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు, యువ వ్యవస్థాపకులు ఆశలు పూర్తిగా నెరవేరలేదని ఎంపీ మేడా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మేడా రఘనాధ్ రెడ్డి మూడు ముఖ్య అంశాలను రాజ్యసభ దృష్టికి తీసుకువచ్చారు.
మధ్యతరగతికి పన్ను భారంలో ఉపశమనం లేదు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పెరుగుతున్నప్పటికీ పన్ను స్లాబులు యథాతథంగా కొనసాగడం వల్ల ద్రవ్యోల్బణ ప్రభావంతో మధ్యతరగతి ప్రజలపై అదనపు భారముందని పేర్కొన్నారు. సంవత్సరానికి సుమారు ₹15 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు గృహం, ఆరోగ్యం, విద్య ఖర్చులతో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. 30 శాతం గరిష్ట పన్ను రేటు తక్కువ ఆదాయ స్థాయిలోనే వర్తించడంతో పెట్టుబడులు, వినియోగం దెబ్బతింటున్నాయని, ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచకపోవడం కూడా నిరాశ కలిగించిందని విమర్శించారు.
వ్యాపారాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోపం వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చాల్సిన సమయంలో దీర్ఘకాలిక పన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక పథకం లేకపోవడం నిరుత్సాహకరమన్నారు. ప్రస్తుతం లక్షలాది పన్ను అప్పీలు పెండింగ్‌లో ఉండటంతో వ్యాపార మూలధనం నిలిచిపోతోందని తెలిపారు. జీఎస్టీ అమలులో కొంతమంది ఫీల్డ్ అధికారులు అనవసర నోటీసులు జారీ చేస్తూ వ్యాపారులను వేధిస్తున్నారని, నమ్మకపూరిత విధానం అవసరమన్నారు. అలాగే, వర్క్స్ కాంట్రాక్టుల్లో ఉపకాంట్రాక్టర్లకు 5% జీఎస్టీ రాయితీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల ఎంఎస్ఎంఈలకు నష్టం జరుగుతోందని, జీఎస్టీ రిఫండ్లు సమయపాలనతో ఇవ్వాలని కోరారు.
జనాభా లాభాన్ని ఉపయోగించుకునే విధానాలు అవసరం మన జనాభాలో దాదాపు 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, మరియు పని చేసే వయస్సు గల జనాభా 2041 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ ఉపాధి మాత్రమే ఏటా అవసరమైన దాదాపు కోటి ఉద్యోగాలను సృష్టించదు. కాబట్టి, ముఖ్యంగా అధిక వృద్ధి చెందుతున్న రంగాలలో యువ వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడంపై విధానం దృష్టి పెట్టాలి. మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టియర్–2, టియర్–3 నగరాల్లోనూ వ్యాపార అవకాశాలు పెంపొందించేలా క్రెడిట్ గ్యారంటీ, నియంత్రణ సడలింపులు అవసరమన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక ఎంట్రప్రెన్యూర్షిప్ డివిడెండ్ రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు.
ఈ అన్ని సూచనలతో పాటు, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ 2026–27కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి తెలిపారు.

